రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రంగారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తోన్న వర్షాలు.. చివరి రెండు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. ఇది ఈ నెల 20 నాటికి తీవ్రమవుతుందని వెల్లడించారు.