రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలు... లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి, శనిగరం గ్రామాల మధ్య పిల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మోయతుమ్మెద వాగు ప్రవాహంతో... శనిగరం ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పోస్తోంది. పిల్లివాగు రహదారి పైనుంచి ప్రవహిస్తుండడంతో తంగళ్లపల్లి నుంచి శనిగరం, బెజ్జంకి మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
అంతా జలమయం...
మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఓ కుంటకు గండి పడగా... వరదనీరు సమీప పొలాల్లోకి వెళ్లింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో లింగారెడ్డి కుంటకు గండి పడింది. నర్సాపూర్ సమీపంలోని రాయరావు చెరువు జలకళ సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గంటన్నర పాటు ఏకధాటిగా వాన పడడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అటు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. మాడిగి, ధనసిరి గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మృత్యువాత పడ్డ గేదెలు
నిర్మల్‌లో గంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల మీదుగా పారే నారింజ వాగు పొంగడంతో మినుము, సోయా, పత్తి, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల- ధర్మపురి మధ్య జాతీయ రహదారిపై నుంచి పొంగుతున్న వాగు ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోగా... గమనించిన స్థానికులు అతడిని కాపాడి వాహనాన్ని బయటకు తీశారు. జగిత్యాల జిల్లా పొలాస ఎల్లమ్మ చెరువు వద్ద గేదెలు మేత కోసం అలుగు దాతుండగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఇందులో 20 గేదెలు మృత్యువాత పడ్డాయి.