తెలంగాణ

telangana

ETV Bharat / state

PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయి.. ప్రాణాలను బలిగొంటున్నాయి! - telangana state rains news

జోరు వర్షాలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగడంతో వివిధ మండలాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేర్వేరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయ్.. ప్రాణాలను బలిగొంటున్నాయ్..!
PROBLEMS WITH FLOODS: వాగులు పొంగుతున్నాయ్.. ప్రాణాలను బలిగొంటున్నాయ్..!

By

Published : Sep 7, 2021, 10:42 PM IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల వాగులను దాటే క్రమంలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో వాగులో చిక్కుకొని తండ్రీకుమారుడు మృతి చెందారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. మల్లన్నపేట వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గొల్లపల్లి మండలం నందిపల్లి వాసులైన గంగమల్లు, విష్ణువర్ధన్​లుగా గుర్తించారు.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగ్గురు గొర్రెల కాపరులు గోదావరి మధ్యలో ఉన్న తిప్పమీదకు గొర్రెలను మేపడానికి వెళ్లారు. ఇంతలో వరద ఉద్ధృతి పెరగడం వల్ల అవతలే చిక్కుకుపోయారు. వేములకుర్తికి చెందిన బాస సోమయ్య, అల్లకుంట లక్ష్మయ్య, నేమురి ఆశన్న... తమ గొర్రెలను మేపడానికి వెళ్లి ప్రవాహంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో వారికి అవసరమైన ఆహారం పంపించారు. ప్రవాహం తగ్గితేనే వాళ్లు ఇవతలకు వచ్చే అవకాశం ఉంది.

ఇద్దరు బతికిపోయారు.. ఒకరు కొట్టుకుపోయారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వానలతో జిల్లావ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగుతున్నాయి. సిరిసిల్ల పట్టణమంతా జలమయం అయింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతమైన పాత బస్టాండ్ పెద్ద బజార్ వెంకంపేట రహదారి వరద నీటితో నిండిపోయింది. అక్కడి నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా... స్థానికులు కాపాడారు. పాత పెట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రహదారి దాటుతుండగా పెరుమాళ్ల దేవయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. రహదారుల మీద ప్రవహిస్తున్న వరద నీటిలో గణేశుని విగ్రహం కొట్టుకుపోయింది.

వాగు దాటుతూ గల్లంతు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ముర్రేడువాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వాగు దాటుతూ తాటి రాంబాబు అనే వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు రాంబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కోళ్లు కొట్టుకుపోయాయి..

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా గర్గుల్​లో గోడ కూలి ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జక్రాన్​పల్లి మండలం చింతలూరులో ఓ పౌల్ట్రీఫామ్​ మునిగిపోగా.. అందులోని కోళ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇది గమనించిన గ్రామస్థులు.. కోళ్ల కోసం ఎగబడ్డారు. చేతికి అందినన్ని కోళ్లను పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు. వర్ష భయంతో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఇదీ చూడండి: Telangana Rains: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు..!

ABOUT THE AUTHOR

...view details