రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. లాక్‌డౌన్ సాయంత్రం 5 గంటలతో ముగియగా.. ప్రజలు ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడటంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వచ్చిన రికార్డుల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్‌లో అత్యధికంగా 121.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో 95.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. రానున్న మూడ్రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
అన్నివిధాలా సన్నద్ధం..
గతేడాది వరంగల్‌ను వరదలు ముంచెత్తాయి. నగరం పూర్తిగా జలదిగ్భందమైంది. వర్షాకాలం మొదలు కావడంతో.. ఈసారి వరదలు వస్తే ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అన్నివిధాలా సన్నద్ధమవుతున్నాయి. లైఫ్ జాకెట్లు, పడవలు, ట్యూబులు ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఎలా కాపాడాలన్న దానిపై విపత్తు నిర్వహణ బృందాలకు హసన్‌పర్తి చెరువులో శిక్షణ ఇచ్చారు.