వాయుగుండం తీరం దాటి బలహీనపడుతుండటంతో.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోనూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ - వాతావరణశాఖ
18:28 October 13
హైదరాబాద్‌లో ఆరెంజ్, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్
భారీవర్షాలతో నగరవాసి బెంబేలెత్తిపోతున్నాడు. చెరువులను తలపిస్తున్న రహదారులపై వెళ్లడం సాహసంగా మారింది. వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు శివారులో భారీ వర్షం కురిసింది. పసుమాముల, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 11.5 సెం.మీ, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో 6.5 సెం.మీ వర్షపాతం నమోదయింది. ఇబ్రహీంపట్నం పరిధిలో 12.6 సెం.మీ వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ విశ్వజిత్ కోరారు. ఎంతటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి 90కి పైగా బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... స్తంభించిన జనజీవనం