Heavy Rainfall in Hyderabad :తెరపివ్వకుండా ప్రతాపం చూపిస్తున్నవరుణుడి దెబ్బకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడం వల్ల నగరవాసులకు అవస్థలు తప్పడం లేదు. మురుగు నీటి కాల్వలు పొంగిపొర్లుతూ జనావాసాలను ముంచెత్తుతోంది. అంబర్‌పేట నుంచి ముసారాంబాగ్ వెళ్లే రహదారి పైకి వరద భారీగా చేరింది. మూసీ నదిలో ప్రవాహ వేగం పెరిగింది. ముసారాంబాగ్ వంతెన వద్ద వాహనదారులను నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నాచారం, మల్లాపూర్, తార్నాక , హబ్సిగూడలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లను ముంచెత్తింది. నాలుగు అడుగుల మేర నీరు చేరడం వల్ల స్థానికులకు అవస్థలు తప్పలేదు.
GHMC Actions on Heavy Rains :కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో వరద ముంపు ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు పడుతున్నందున క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గాజులరామారం , బాలాజీ ఎన్‌క్లేవ్ చుట్టూ ఉన్న కాలనీల్లోకి వరద చేరికపై కారణాలేంటని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వానాకాలంలో తిప్పలు పడుతున్నందను శాశ్వత పరిష్కారం చూపాలని బల్దియా కమిషనర్‌కు స్థానికులు మొరపెట్టుకున్నారు.
జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని రోనాల్డ్ రోస్ స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా అధికారులతో కమిషనర్ వర్షాలు, వరదపరిస్థితిపై సమీక్షించారు. ఇంజినీరింగ్, సర్కిల్‌స్థాయి అధికారులు మాన్సూన్ అత్యవసర బృందాల సాయంతో ముంపు ప్రాంతాల్లో వరదను ఎప్పటికపుడు తొలగించాలని సూచించారు. హైదరాబాద్‌లో వరద సహా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 157 మొబైల్ , 242 స్టాటిస్టికల్ బృందాలు ఏర్పాటు చేశామని రోనాల్డ్ రోస్ వివరించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని రోనాల్డ్ రోస్ అప్రమత్తం చేశారు.
Traffic Problems Due To Rain :ఎగువన కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లోకిఇన్ఫ్లో ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ఇంకా వరద పెరిగితే గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై నీళ్లు చేరి దాదాపు నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్యస్థానాలు చేరేందుకు గంటల కొద్దీ రోడ్లపైనే నిరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లి ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీ వాసులను తహసీల్దార్, కార్పొరేటర్ కోరారు.