Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైంది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో.. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం మూడు గంటల పాటు వరుణుడు ప్రతాపం చూపించాడు. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో గత పదేళ్లలో సెప్టెంబర్‌లో ఎన్నడూ లేనంత అధిక వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా నగర శివారులోని నందనం వద్ద 16.7, మెహిదీపట్నంలో 11.25, నాంపల్లిలో 10.33 సెంటీమీటర్లు కురిసింది. గతంలో 2017 సెప్టెంబరు 6న 24 గంటల వ్యవధిలో 9 సెంటీమీటర్ల రికార్డు వర్షం పడింది. సోమవారం 3 గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో అధిక వర్షం పడటంతో కొత్త రికార్డు నమోదైంది.
కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో వర్షంతో రోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆస్పత్రి పాత భవనంలోని ఐసీయూలో పెచ్చులు ఊడిపోవడంతో రోగులపై నీళ్లు పడ్డాయి. గోడలకు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగల వెంట నీరు కారుతుండటంతో రోగులను కొత్త భవనానికి తరలించారు. ఉస్మాన్‌గంజ్‌లో రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో.. ఎవరూ బయటకు రాలేదు. బేగంబజార్‌లోని పలు దుకాణాల్లోని సెల్లార్లలోకి వర్షం నీరు చేరి సామగ్రి నీట మునిగింది. ఆసిఫాబాద్, గుడి మల్కాపూర్, వివేకానంద నగర్, మలక్‌పేట, ముషీరాబాద్ తదితర చోట్ల ఆవాసాలు జలమయమయ్యాయి. గుడిమల్కాపూర్ పూల మార్కెట్, సంతల్లోని దుకాణాలు కొట్టుకుపోయాయి. సరూర్‌నగర్ చెరువు దిగువ ప్రాంతాలు.. కవాడిగూడ, అశోక్‌నగర్, అంబర్‌పేట, బేగంపేటలో నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వర్షం ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. పలుచోట్ల అంధకారం అలుముకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు కాసేపు ట్రాఫిక్ విధులు నిర్వర్తించి వాహనాలు క్రమబద్దీకరించారు.
గంటల తరబడి ట్రాఫిక్ జామ్..: ఎడతెరిపి లేకుండా కురవడంతో వాగులు, వంకలు, నాలాలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్‌జాం ఏర్పడింది. సహాయ చర్యల కోసం జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.