Hyderabad Rains Today: రాష్ట్ర రాజధానిని వరుణుడు ముంచెత్తాడు. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. మూసీనదిలో ప్రవాహం పెరిగింది. మెహిదీపట్నం, గోషామహల్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో వర్షందంచికొట్టింది. ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌లోనూ వరణుడు ప్రభావంచూపాడు. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో జోరు వానపడింది.
చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడటం వల్ల జనం తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లపై భారీగా వరద చేరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
గురు, శుక్ర, శని వారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిసూచించింది. బంగాళాఖాతం తూర్పు, ఆగ్నేయ ప్రాంతంలో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని...ఆ ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. వర్షాలుపడే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రయాణాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ నేడు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.