Rain in Hyderabad: హైదరాబాద్‌లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి పలు కాలనీలు ఆగమాగమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం... నగరంలో బీభత్సం సృష్టించింది. రహదారులపై వరద పొంగిపొర్లింది. కుండపోత కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాకుత్‌పురా నియోజకవర్గం ధోభీ ఘాట్ ప్రాంతంలో బోట్ల ద్వారా చిన్న పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కార్వాన్‌లోనూ రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. బురద వల్ల జనం ఇబ్బంది పడ్డారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బుద్వేల్, శివరాంపల్లిలో యూసఫ్‌గూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మియాపూర్ పరిసర ప్రాంతాలు, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూర్ రోడ్లు జలమయమయ్యాయి.
ఉద్ధృతంగా మూసీ:అంబర్‌పేటలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్లకుంటలో భారీ వృక్ష నేల కొరిగింది. ఈదురుగాలుల ధాటికి తీగలగూడ గుడిసెల్లో సామగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి. కమలానగర్‌లో రేకుల ఇంటిపై.... కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించి ఇటుకలు పడి.... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నేలకూలిన చెట్లు:కూకట్‌పల్లిలో రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వివేకానందనగర్ డివిజన్‌లో చెట్టు కూలి రోడ్డుపై పడింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లిలో భారీ వర్షం కురిసింది. కంటోన్మెంట్ ఆరో వార్డు పరిధిలో భారీ వృక్షం నెలకూలింది. హైదర్‌గూడ రహదారిపై భారీగా నీరు చేరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బషీర్‌బాగ్ లా కళాశాల ముందు మోకాళ్ల లోతు నీరు చేరాయి. మాల్కాజిగిరిలో షిరిడి సాయినగర్, ఎన్ఎమ్డీసీ, సత్తిరెడ్డి కాలనీలు నీట మునిగాయి.
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు: భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేటతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులకు మైత్రీవనం స్టేట్‌హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి.
భారీ వర్షపాతం: ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో 7.2 సెంటీమీటర్లు, బన్సీలాల్‌పేట్‌లో 6.7 సెంటీ మీటర్లు, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6.1 సెంటీ మీటర్లు, అల్వాల్లో 5.9 సెంటీ మీటర్లు, ఎల్బీ నగర్‌లో 5.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు .
ఇవీ చదవండి: రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. అన్నదాతకు తీరని నష్టం
శాస్త్రీయంగానే పిల్లల వ్యాక్సినేషన్: సుప్రీం కోర్టు
'వడదెబ్బతో నెలలో 17 మంది మృతి... మంగళవారం ఒక్కరోజే ఆరుగురు'