తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - telangana varthalu

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Oct 16, 2021, 2:47 PM IST

Updated : Oct 16, 2021, 5:14 PM IST

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్‌బీనగర్‌, చింతలకుంట, దిల్​సుఖ్​నగర్​ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్‌, లంగర్‌ హౌస్‌, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.

వీధుల్లోకి పోటెత్తుతోన్న వరద

ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, లక్డీకాపూల్‌, మెహిదీపట్నం, చాదర్‌ఘాట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకల అంతరాయం ఏర్పడుతుండటంతో... వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు, వీధుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్‌పేట్, బీఎన్‌ రెడ్డి నగర్‌, తుర్కయంజాల్, మీర్‌పేట్, పీర్జాదీగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

గంట సేపు కురిసిన వర్షానికి వనస్థలిపురం పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వచ్చే రహదారిపై వరద నీరు నిలవడంతో చింతలకుంట వద్ద, పనామా కూడలి వద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల లోతుకు పైగా రహదారిపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబర్ పేటలో భారీగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఓయూ పరిధిలోని మోహిని చెరువు నుంచి వస్తున్న వరద తాకిడికి అంబర్‌పేట, పటేల్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. కోదండరాం నగర్, సీసాల బస్తీ కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండగా.. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలక్​పేట్​లో ఓ వాహనదారుడు జారీపడగా.. స్వల్ప గాయాలయ్యాయి.

అప్రమత్తమైన యంత్రాంగం

రేపు, ఎల్లుండి కూడా జంట నగరాల్లో పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న దృష్ట్యా... జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని మోహరించింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని... ఆయా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరో రెండు రోజులు వర్షాలు

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్ , నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది.

ఇదీ చదవండి: 'రామోజీ ఫిలింసిటీ.. హైదరాబాద్​లో ఉండటం గర్వకారణం'

Last Updated : Oct 16, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details