Hyderabad Rain: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లిలో భారీ వర్షం కురవగా.. మురుగు నీరు రహదారిపైకి చేరింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపుర్ ప్రాంతాల్లో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో లింగంపల్లి-ఓల్డ్ ముంబయి రోడ్డు వద్ద గల రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపు కురిసిన వర్షానికే రహదారులు జలమయమైతే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.
పొంగిపొర్లిన మురికి కాలువలు..: వరంగల్, హనుమకొండ జిల్లాలో రెండు గంటల పాటు కురిసిన వానకు.. రహదారులన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని రహదారుల పక్కనున్న మురికి కాలువలు పొంగిపొర్లడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.