హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా చల్లబడి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలో అత్యధికంగా సౌత్ హస్తినాపురంలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 5.3, వనస్థలిపురంలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
నగరం నలుమూలలా జోరువానే...
హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మలక్‌పేట్, చంపాపేట్, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, ఈసీఐఎల్, నాగారం, జవహర్‌నగర్, కీసర, దమ్మాయిగూడ, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీనగర్, మన్సురాబాద్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, హయత్‌నగర్, తుర్కయాంజల్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, గోషామహల్, బేగంబజార్, చాదర్‌ఘాట్, సైదాబాద్, సంతోష్‌నగర్, మాదన్నపేట్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బోరబండ, మోతీనగర్, ఈఎస్‌ఐ, సనత్‌నగర్, తార్నాక, మల్లాపూర్, హబ్సిగూడల లోని పలు చోట్ల చిరుజల్లులు కురవగా.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వాన తెచ్చిన ఇక్కట్లు
భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లడం వల్ల లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.