హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. శనివారం తీవ్రత పెరగ్గా.. ఆదివారం అదేస్థాయి వానలు పడ్డాయి. అయితే ఈ వానలకే లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులూ జలమయమయ్యాయి. దీంతో టోలిచౌకి, షేక్‌పేట, అత్తాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. డ్రైన్లలో చెత్తాచెదారం నిండటంతో నీరు ఎక్కడికక్కడ నిలిచి రోడ్లపైకి చేరింది. నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, విపత్తు నిర్వహణ దళ సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో 5.93సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మెహిదీపట్నంలో 0.3సెం.మీలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
వరద నీరు రోడ్లపైకి చేరి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అత్తాపూర్ ప్రధాన రహదారి మొత్తం మోకాళ్లలోతు వరద నీటితో నిండిపోయింది. షేక్‌పేట పరిధిలోనూ వరద బీభత్సం సృష్టించింది. గతేడాది వానలు ఉక్కిరిబిక్కిరి చేసి వేల కుటుంబాల్ని రోడ్డున పడేశాయి. అయితే నాలాల విస్తరణ, డ్రైన్ల మరమ్మతుల విషయంలో అదే నిర్లక్ష్యం కొనసాగడంతో పాత పరిస్థితి పునరావృతమైంది. నిజాంపేట, మియాపూర్ ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు రావడంపై ఫిర్యాదులొచ్చినా సిబ్బంది స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోలిచౌకిలో స్థానిక కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు.