హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, కవాడిగూడ, భోలక్‌పూర్, యూసఫ్‌గూడ, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట్, ప్యారడైజ్ సెంటర్, చిలకలగూడ, రామంతాపూర్, జీడిమెట్ల, చింతల్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సుచిత్ర, కొంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, ప్రగతి నగర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, మల్కాజిగిరి, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, సుల్తాన్ బజార్, నాంపల్లి, మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, లంగర్‌హౌస్, గోల్కొండ, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం పడింది.
ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో వర్షం కారణంగా వీధుల్లో భారీ ఎత్తున నీరు ప్రవహిస్తోంది. బోడుప్పల్, పీర్జాధిగూడ నగర పాలక సంస్థలు, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు నీరు ఇళ్లలోకి చేరింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కూకట్‌పల్లి మూసాపేట్‌లోని వసుంధర ఆసుపత్రి సమీపంలో నాలా పొంగిపొర్లింది. ఫలితంగా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లోకి భారీగా నీరు చేరింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు తమ సామగ్రితో రోడ్డుపైకి వచ్చారు.
నీట మునిగిన కాలనీలు..
బోయిన్‌పల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని శ్రీ సాయి కాలనీ, స్వర్ణదామనగర్, పీవీ ఎంక్లేవ్ రోడ్డు, రామన్నకుంట చెరువు సమీపంలోని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. సమస్యను ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.