Heavy rains in Hyderabad : హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం వరుణుడు కుండపోత వర్షంతో విరుచుకుపడ్డాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడి వాతావరణం ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం కురిసింది. నగరంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్, పోచారంలో రహదారులు చెరువులను తలపించాయి. పలు కాలనీల్లో వరద నీరు ముంచెత్తడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.
బస్తీల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అంధకారం నెలకొంది. ఉప్పల్ కూడలి నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఘట్కేసర్-కీసర మార్గంలో చెట్లు నేలకూలగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లాలో భారీ వర్షం: హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం వర్షం పడింది. నిర్మల్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరబెట్టిన ధాన్యం సాయంత్రం కురిసిన వర్షానికి మరోసారి తడిసిపోయాయి. రోడ్లపై వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.