Telangana Rains Today 2023 :రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నవర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముఖ్యంగా.. హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఉదయం పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో.. వాహన దారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ మొత్తం నీట మునిగింది. మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
Telangana Rains Alert 2023 : నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివారు కాలనీవాసులు వణికిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో.. రోజుకో కొత్త కాలనీ ఏర్పాటు అవుతుంది. కొత్త కాలనీలలో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై ఎక్కడ ఎలాంటి గుంతలు ఉన్నాయో తెలియక.. వాహనాదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు.
Godavari Water Level at Bhadrachalam : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నవరదతో.. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో.. నీటిమట్టం 43అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరినందున అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ కలెక్టర్ డా. ప్రియాంక అలా జారీ చేశారు. గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నందున.. ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.