తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం - Rain across in telangana

రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. వడగండ్లతో కూడిన అకాల వర్షం కారణంగా.. కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

Hyderabad
Hyderabad

By

Published : Mar 16, 2023, 8:01 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన జల్లులు ఊరటనిచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా ఆరుగాలం శ్రమించిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. ఒంటి గంట వరకు దంచికొట్టిన ఎండ.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆకాశమంతా మబ్బులతో కమ్ముకుంది. పరిగి, పూడూరు, మర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి.

1,000 ఎకరాల్లో దెబ్బతిన్న ఉల్లి పంట: దీంతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రెండు మండలాల్లో అత్యధికంగా 1,000 ఎకరాల్లో ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. కూరగాయల పంటలపై 70శాతం వరకు ప్రభావం చూపిందని వారు పేర్కొన్నారు

పలు జిల్లాలో వడగండ్ల వాన భీభత్సం: సంగారెడ్డి జిల్లా కొహీర్, జహీరాబాద్ మండలాల్లో.. వడగండ్ల వర్షం దంచి కొట్టింది. వర్షపు చినుకులను మించి.. వడగండ్లు కురిశాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా మంచు ప్రాంతాన్ని తలపించింది. కోహిర్ మండలం బడంపేట్ మనియార్​పల్లి, పర్షపల్లి సహా.. జహీరాబాద్ మండలం శేఖాపూర్, మల్‌చెల్మ గ్రామాల్లో ఏకధాటిగా వడగండ్ల వాన కురిసింది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి గ్రామాల్లో ఈదురుగాలులు, కూడిన వడగండ్లు కురిశాయి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆరు బయట ఉన్న కార్లు, ఆటోల అద్దాలు పగిలి పోయాయి. నాంపల్లి,పెద్దాపురంలో వడగండ్ల వాన తాకిడికి మూగ జీవాలు పరుగులు తీశాయి.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలపాట వాన దంచికొట్టింది. అకాల వర్షం వల్ల కారణంగా మిర్చి పంటలు, ఆరబెట్టిన మిరపకాయలు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చర్ల మండలంలోని మామిడిగూడెం వద్ద చెట్టుపై పిడుగుపడటంతో చెట్టుకింద ఉన్న 22 మేకలు, గొర్రెలు మృతి చెందాయి.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్దలో ఒకరు, వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికల్‌పాడులో మరొకరు చనిపోయారు. నాగర్‌కర్నూల్‌ బిజినేపల్లి మండలం లింగసానిపల్లిలో పిడుగుపాటుకు గొర్లకాపరి బాలకృష్ణ ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:హైదరాబాద్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వడగండ్ల వానలో వికారాబాద్

'మోదీ, అదానీ మధ్య అసలు రిలేషన్​ ఏంటి?.. కేంద్రానికి భయం ఎందుకు?'

ABOUT THE AUTHOR

...view details