వరుణుడు శాంతించినా... వరద ఉద్ధృతి హైదరాబాద్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్ , రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు ... జంట జలాశయాల నుంచి విడుదలైన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి ఈసీ జలాలు తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు... భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. పురానాపూల్‌ను మూసీ ముంచెత్తింది. భారీగా వరద నీరు చేరడంతో పరివాహాక ప్రాంత కాలనీలు జలమయమయ్యాయి. పురానాపుల్ వద్ద వరదలో ఓ వ్యక్తి మునిగిపోతుండగా మంగల్‌హాట్ ఎస్ఐ రాజు... నీటిలోకి దూకి కాపాడాడు. భారీ ఎత్తున వరదనీరు చుట్టుముట్టడంతో పురానాపూల్, జియాగూడ ప్రజలు ఆహారం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వరద పురానాపుల్ శ్మశానవాటికను ముంచెత్తడంతో అంత్యక్రియలకు ఆటంకం కలిగింది. జియాగూడ ప్రాంతంలో చెరువుల్ని తలపిస్తున్న రోడ్లతో వాహన రాకపోకల్ని నియంత్రించారు.
చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి.... రాకపోకలు నిలిపివేశారు. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో 'అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్' వైపు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసానగర్ , కమలానగర్ పరిసరాలను మూసీ వరద చుట్టుముట్టింది. మూసీ పరివాహకంలోని చాదర్‌ఘాట్, ముసానగర్, శంకర్‌నగర్ కాలనీవాసులను అప్రమత్తం చేసిన అధికారులు … బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.