Fire Accident in Hyderabad: వేసవికాలం రాక ముందే నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజు ఏదో ఒక చోట చిన్నచితక మొదలుకొని అక్కడక్కడ భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నది సమీపంలోని అశోక ఇండస్ట్రీస్ గోదాంలో ఉన్నటుండి మంటలు వచ్చాయి. ఫర్నిచర్ ఉన్న గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లు, 6 ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. భారీగా ఎగిసిపడిన మంటల ధాటికి గోదాం పైకప్పు కూలడంతో.. సహాయకచర్యలు కొంత కష్టంగా మారాయని సిబ్బంది తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా అధికారులు.. గోదాం పరిసరాల్లోని కాలనీ వాసులను ఖాళీ చేయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదంలో ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పరారీలో గోదాం యాజమాని : మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది గోదాం గోడలను పొక్లెయినర్లతో కూల్చారు. మంటల దాటికి చుట్టుపక్కల దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారిందంటూ కాలనీల వాసులు వాపోయారు. కాసేపు అగ్నిమాపక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జనావాసాల మధ్య గోడౌన్లకు అనుమతి ఎలా ఇచ్చారంటూ అధికారులను నిలదీశారు. పోలీసులు గోదాం యాజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.