తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసుపత్రులు: ప్రైవేటు ల్యాబ్‌లో వసూళ్లపై అడిగేవారేరి?

కరోనా మహమ్మారి ఓ వైపు ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటుంటే... మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు టెస్టుల పేరుతో సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నాయి. ఎక్స్​ప్రెస్ సేవల పేరిట ఇష్టానుసారంగా జేబులు కొల్లగొడుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్న వారు... ఇప్పుడు ఏం అయ్యారని ప్రశ్నిస్తున్నారు.

heavy fees in corporate hospitals,  fees for covid tests
కరోనా పరీక్షలకు అధిక ఫీజులు, హైదరాబాద్​లో అధిక ఫీజులు

By

Published : Apr 26, 2021, 11:29 AM IST

ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా టెస్టుల పేరుతో దందా మొదలుపెట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తూ రోగులు, అనుమానితుల జేబులు కొల్లగొడుతున్నాయి. ఒక్కో టెస్ట్‌పై రూ.300-500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫలితాలు చెప్పేందుకు గంటల చొప్పున ధరలను నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు కేవలం రూ.500 తీసుకోవాలని, ఇంటికెళ్లి శాంపిల్‌ తీసుకుంటే రూ.750 వసూలు చేయాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత ధరకు ఒక్క పైసా ఎక్కువ తీసుకున్నా, నిబంధనలు అతిక్రమించినా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకుల ధోరణి మారడం లేదు. పీపీఈ కిట్లు, టెస్ట్‌ రుసుముకు అదనంగా.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, సేఫ్టీ ఛార్జీల పేరుతో ఎక్కువ సొమ్ము జేబులో వేసుకుంటున్నారు.

జీవో ఏం చెబుతోందంటే..

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ ధరను రెండుసార్లు తగ్గించింది. గతేడాది నవంబర్‌లో దీని ధర రూ.2,200 ఉండగా దానిని రూ.850కి, ఇంటికి వచ్చి శాంపిల్‌ తీసుకుంటే రూ.2,600 ఉండగా దానిని రూ.1,200కి తగ్గించారు. డిసెంబర్‌ మూడో వారంలో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఈ ధరల్ని మరింతగా తగ్గించింది. ప్రైవేటు ఆసుపత్రి లేదా ల్యాబ్‌లో పరీక్ష చేయించుకుంటే రూ.850గా ఉన్న ధరను రూ.500కి, ఇంటికి వచ్చి శాంపిల్‌ తీసుకుంటే రూ.1200 ధరను రూ.750కి తగ్గించింది. గతేడాది డిసెంబర్‌ 21న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోనే నిర్ధారణ పరీక్ష రుసుము, పీపీఈ కిట్‌, ఇతరాలు అన్నీ కలుపుకొనే ఈ ధరను నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఉదంతాలు ఇలా..

  • కొండాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆర్టీపీసీఆర్‌ చేయించుకునేందుకు ఓ ప్రైవేటు ల్యాబ్‌ను సంప్రదించి ఇంటి వద్దే శాంపిల్‌ ఇచ్చారు. ఇందుకోసం వైద్య నిర్ధారణ పరీక్ష రుసుము రూ.1900, ఇంటికి వచ్చి శాంపిల్‌ తీసుకున్న పేరుతో మరో రూ.100 అదనంగా తీసుకున్నట్లు బాధితుడు వాపోయారు.
  • మాదాపూర్‌కు చెందిన మరో వ్యక్తి అనుమానంతో ఓ ప్రైవేటు ల్యాబ్‌ను సంప్రదించారు. 12 గంటల వ్యవధిలో నిర్ధారణ పరీక్ష ఫలితాలు ఇవ్వాలంటే రూ.1,300, 24 గంటల్లో అయితే రూ.1,100, 36 గంటల్లో అయితే రూ.800 చొప్పున చెల్లించాలని ప్యాకేజీలు చెప్పారు. ఆయన 24 గంటలకు డబ్బు కట్టగా ఫలితాన్ని మెయిల్‌ ద్వారా పంపించారని తెలిపారు. నిర్ధారణ త్వరగా జరిగితే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చనే ప్రజల ఆతృతను సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు.
  • మాదాపూర్‌లోని మరో ల్యాబ్‌ ఏకంగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ పేరుతో దందా మొదలుపెట్టింది.
  • ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ 1 (15 నుంచి 18గంటలు) మొత్తం రూ.1300 (రిజిస్ట్రేషన్‌ ఛార్జీ 300, టెస్టింగ్‌ ఛార్జీ రూ.500, ఎక్స్‌పిడైటెడ్‌ ఫీజు - 500).
  • ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ -2 (24గంటలు) మొత్తం రూ.1100 (టెస్టింగ్‌ ఛార్జీ 500, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ 300, ఎక్స్‌పిడైటెడ్‌ ఛార్జీ 300).
  • జనరల్‌ - (36 నుంచి 48గంటలు) మొత్తం రూ.800 (పరీక్షకు రూ.500, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ 300) చొప్పున వసూలు చేస్తోంది.

ఇదీ చదవండి: 'ప్రైవేట్‌ ల్యాబ్‌లో పాజిటివ్‌గా తేలినా.. ఉచితంగా ఔషధ కిట్లు'

ABOUT THE AUTHOR

...view details