శ్రీ వారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద... భక్తుల రద్దీ పెరగటంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో... టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలలో తోపులాట జరిగి.. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
భక్తుల ఆవేదన: తాము తిరుపతికి చేరుకుని మూడు, నాలుగు రోజులు అవుతుందని... టోకెన్లు మాత్రం ఇవ్వటం లేదని భక్తులు వాపోతున్నారు. భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కనీసం కొండపైకి కూడా అనుమతించట్లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి అనుమతిస్తే తలనీలాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటామని వాపోతున్నారు. ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని... గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈటీవీ-భారత్ కథనాలకు స్పందన: శ్రీవారి భక్తుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఈటీవీ-భారత్ కథనాలపై తితిదే అధికారులు స్పందించారు. ఉదయం నుంచి భక్తుల కష్టాలను కళ్లకు కట్టినట్లు ఈటీవీ-భారత్ ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన తితిదే... భక్తులకు దర్శన టోకెన్లు లేకున్నా తిరుమలకు అనుమతిస్తున్నారు.