రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో హైదరాబాద్లోని ముషీరాబాద్ చేపల మార్కెట్ మరింత కిక్కిరిసింది. వ్యాపారులు, కొనుగోలుదారులతో మార్కెట్ ఆదివారం కిటకిటలాడింది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం చేపలు తినాలనే భావనతో ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. అదే అదునుగా భావించిన అమ్మకందారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోయారు.
తగ్గని ధరలు
ప్రధానంగా లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా చేపల దిగుమతి పూర్తిగా తగ్గింది. ఆ సమయంలో చేపల ధరలు విపరీతంగా పెరిగాయి. కాగా ఈ వారం వంద లారీల చేపలు అదనంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యాయి. అయినప్పటికీ ధరలు ఏమాత్రం తగ్గలేదు. లాక్డౌన్ సమయంలో కొర్రమీను రూ.350 కేజీ ఉండగా, నేడు రూ.500 పలికింది. ఎక్కువగా విక్రయించే బొచ్చ, రవ్వు, ఇతర సాధారణ చేపల ధరలూ పెరిగాయి.