నివర్ తుపాన్...ఉత్తరాంధ్ర జిల్లాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ... రైతులపై మాత్రం పంజా విసిరింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వరి కోతలకు రైతులు సిద్ధమవుతారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్‌ల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం అన్న తేడా లేకుండా ద్వీపకల్ప భాగంలో ఏదొక ప్రాంతం తుపాన్ల ప్రభావానికి గురవుతూనే ఉంటుంది. ఫలితంగా... కోస్తా జిల్లాలకు ఎప్పుడూ ఈ కాలం సవాళ్లు విసురుతూనే ఉంటుంది. ఈసారి నివర్ తుపాన్ వంతు వచ్చింది. పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ... పంట నష్టం భారీగానే జరిగింది.
వణికిస్తున్న నివర్...
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. సీజన్ చివరిలో అకాలవర్షాలు ముంచేశాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తున్న తుపాన్లు అన్నదాతలను వణికిస్తున్నాయి. రెక్కల కష్టం ఇంటికొచ్చే వేళ.. కలవరానికి గురిచేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. కోతలు కోసి చేతికొచ్చిన ధాన్యం రాశులు దాచుకోలేని దయనీయ స్థితి. పోనీ కొనుగోలు కేంద్రాలైనా తెరిచారా..? అంటే అదీ లేదు. నిబంధనల కొర్రీలతో వాటి ఏర్పాటులో ఇంకా అలసత్వం వహిస్తున్నారు అధికారులు. గిట్టుబాటు ధర వచ్చేదాకా ఉంచలేక, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోలేక రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
అమ్మకం అవస్థలు
ఆర్జీఎల్ వంటి తేలిక రకం ధాన్యం 15 రోజుల ముందుగానే చేతికొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నూర్పిడి పూర్తి చేసిన రైతులు.. ఇప్పుడు వాటిని అమ్మేందుకు అవస్థలు పడుతున్నారు. నివర్ తుపాను ప్రభావంతో ఏకధాటిగా జల్లులు పడ్డాయి. ఫలితంగా పొలాల్లోకి నీరు చేరింది. ఈనెల ఆరంభంలో అల్పపీడన ప్రభావంతో వర్షం కురవగా.. వారం రోజులకుపైగా వరిపంట నీటిలోనే నానిపోయింది. వర్షాలకు వరికుప్పలతో పాటు కోతకోసిన పంట తడిచి పోయింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై పెట్టుకున్న అశలన్నీ ఆవిరి అవుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.