ఈ ఒక్కరోజు ఆగితే.. ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అప్పటివరకు ఆగలేని కొందరు ఔత్సాహికులు గెలుపు గుర్రాల మీద బెట్టింగులు వేస్తున్నారు. అభ్యర్థుల ప్రచార సరళి, సామర్థ్యాలు, ధనబలం లెక్కలోకి తీసుకొని విజయాన్ని అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీల్లో బాద్షా ఎవరు..? అన్ని పురపాలికల్లో గులాబీ జెండా ఎగురుతుందా..? కాంగ్రెస్, భాజపాలకు చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయా? ఇలా ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.
పోటాపోటీగా మున్సిపల్ బెట్టింగ్లు..
శనివారం మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేటీఆర్ చెబుతున్నట్టు కారు జోరు పనిచేస్తుందా? లేదా కాంగ్రెస్ నేతల హస్తవాసి తిరుగుతుందా..? భాజపా ఖాతాలోకి సీట్లు ఎన్నొస్తాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట. అంతేనా..బెట్టింగ్ రాయుళ్లు పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఐపీఎల్, సంక్రాంతి పందాల కన్నా జోరుగా మున్సిపల్ బెట్టింగ్ సాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.