రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కౌటాలలో అత్యధికంగా 46.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
జగిత్యాల జిల్లాలోని రాఘవపేట, ఎండపేట, కొల్వాయిల్లో 45.9 డిగ్రీలు, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని కనగల్లో 45.7, వరంగల్ జిల్లా రాయపర్తిలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
సాయంత్రం.. చల్లదనం..: పగటిపూట నిప్పుల కొలిమిలా ఉన్నా.. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడి రాష్ట్రవ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, జీడిమెట్ల, గాజులరామారం, సూరారం, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది.