హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ చానల్ద్వారా మలక్‌పేట్ యశోద ఆస్పత్రి నుంచి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి హృదయాన్ని నిమ్స్‌లో రోగికి మార్పిడి చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు యశోదా నుంచి గుండె తీసుకుని అంబులెన్స్బయలుదేరనుంది.
కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఖమ్మానికి చెందిన వీరబాబు కానిస్టేబుల్ (34) ఈనెల 12న విధులకు వెళ్తుండగా గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో.. పంజాగుట్టల నిమ్స్‌లో రోగికి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా హృదయాన్ని తరలించనున్నారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొట్ట మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు గుండెను తరలిస్తున్నారు.