నాలెడ్జ్ సిటీలో డీఎల్ఎఫ్కు కేటాయించిన భూములు అక్రమంగా మై హోం గ్రూప్‌కు చేరాయంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఇతర ప్రతివాదులను హైకోర్టు మరో సారి ఆదేశించింది. చట్టప్రకారమే కేటాయింపులు జరిగాయని ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సంస్థ డైరెక్టర్ జూపల్లి శ్యాంరావు కోర్టుకు నివేదించారు.
నాలెడ్జ్ హబ్ కోసం టీఎస్ఐఐసీకి ప్రభుత్వం 414 ఎకరాలు కేటాయించగా.. అందులోని 140 ఎకరాల్లో ఐటీ, వాణిజ్యం, వినోదం తదితర నిర్మాణాల కోసం టెండర్లు పిలిచారని హైకోర్టుకు సమర్పించిన కౌంటరులో వివరించారు. అందులో 31 ఎకరాలను డీఎల్ఎఫ్ సంస్థ సుమారు రూ. 580 కోట్లతో దక్కించుకుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం డీఎల్ఎఫ్ రాయ్ దుర్గ్ డెవలపర్స్ ప్రాజెక్టు లిమిటెడ్ అనే ఎస్పీవీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.