సాధారణంగా వర్షం పడేటప్పుడు చాలామంది వేడివేడి బజ్జీలు, సమోసాలు లేదా పకోడీలు వంటివి తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే వీటి ద్వారా ఆరోగ్యపరంగా అంత ప్రయోజనాలు ఉండకపోవచ్చు. పైగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి బరువు తగ్గాలనుకొనేవారు, పోషకాహారం తీసుకొనేవారికి అంతగా సరిపడవు. కాబట్టి నోటికి రుచికరంగా ఉంటూ, ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి.
మొక్కజొన్నతో మస్త్..
వర్షాకాలం ప్రారంభంలోనే మొక్కజొన్నలు మార్కెట్లో దర్శనమివ్వడం ప్రారంభిస్తాయి. చినుకులు పడినప్పుడు వీటిని వేడివేడిగా కాల్చుకుని తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. మొక్కజొన్న వల్ల డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటివి దరిచేరకుండా ఉంటాయి. అలాగే శరీరానికి అవసరమయ్యే శక్తిని కూడా అందిస్తుంది. విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్‌లను అందించడం ద్వారా రక్తహీనత ఎదురవకుండా కాపాడుతుంది.
చిరుజల్లులను ఆరోగ్యంగా ఆస్వాదిద్దామిలా..! సాబుదానా వడ
సగ్గుబియ్యంలో ప్రొటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి తొలకరి సమయంలో వీటిని ఉపయోగించి తయారుచేసిన వేడివేడి వడలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండచ్చు. అలాగే ఇవి చాలా రుచికరంగా కూడా ఉంటాయి.
ఛాట్, నూడుల్స్..
పెద్దల నుంచి పిల్లల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమంది ఇష్టపడే ఆహారపదార్థాల్లో ఇవి ముందుంటాయి. తొలకరి జల్లుల సమయంలో వీటిని రుచి చూస్తూ కూడా మనం ఎంజాయ్ చేయచ్చు. అయితే బయట లభ్యమయ్యేవి మాత్రం కాదు సుమా! ఇంట్లోనే వివిధ రకాల కూరగాయలు ఉపయోగించి తయారుచేసిన హెల్దీ ఛాట్ లేదా నూడుల్స్‌ని స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా అటు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.
చిరుజల్లులను ఆరోగ్యంగా ఆస్వాదిద్దామిలా..! హాట్ హాట్ సూప్..
ఎంతసేపు తినేవేనా?? తాగడానికి ఏం లేవా? అని ఆలోచిస్తున్నారా?? అక్కడికే వస్తున్నామండీ.. సహజసిద్ధంగానే చాలామంది డైట్ లిస్ట్‌లో ఉండే పదార్థాల్లో సూప్ కూడా ఒకటి. రకరకాల కూరగాయలు లేదా చికెన్, మటన్.. వంటి వాటితో తయారుచేసే ఈ సూప్‌లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటిని తక్కువ మొత్తంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. బీట్‌రూట్ అండ్ క్యారట్ సూప్, చికెన్ అండ్ కార్న్ నూడుల్ సూప్, బ్లాక్ ఐ బీన్ వెజిటబుల్ సూప్.. లాంటి రుచికరమైన సూపులు ఆరోగ్యాన్ని అందించడంలో ముందుంటాయి.
గరమ్ గరమ్ చాయ్..
మామూలుగానే కొందరికి టీ లేదా కాఫీ లేకపోతే రోజు పూర్తికాదు. ఇక చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడి టీ లేదా కాఫీ తాగాలని మనసు కోరుకోకుండా ఉంటుందా చెప్పండి? అయితే సాధారణ టీ లేదా కాఫీలకు బదులుగా ఈ సమయంలో గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటివి తాగడం మంచిది. వీటిని కూడా మరీ ఎక్కువగా కాకుండా మితంగానే తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
చిరుజల్లులను ఆరోగ్యంగా ఆస్వాదిద్దామిలా..! వర్షాకాలం వీటికి దూరం..
* ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండ్లను కూడా ఆహారంగా తీసుకోకూడదు. చల్లని వాతావరణం కారణంగా బ్యాక్టీరియా లేదా వైరస్ చాలా తొందరగా వృద్ధిచెందే అవకాశాలుంటాయి. కాబట్టి వాటి కారణంగా అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తపడాలి.
* వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటివి వీలైనంత తక్కువమొత్తంలో తీసుకోవాలి. అలాగే మాంసాహారం కూడా వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది.
* కాఫీ, టీలను మితంగా తీసుకోవాలి.
చూశారుగా.. తొలకరి జల్లులను ఎంజాయ్ చేయడానికి ఉపకరిస్తూ ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్.. మీరు కూడా వీటితో ఈ వర్షాకాలాన్ని ఆరోగ్యంగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి మరి!