కరోనా వైరస్ (కొవిడ్-19) తో కేవలం ఆరోగ్య పరమైన రిస్క్ మాత్రమే కాదు, ఆర్థిక రిస్కు కూడా కనిపిస్తోంది. ఈ వైరస్ సోకితే కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి. మరి ఇంతకాలం ఆస్పత్రుల ఖర్చులు భరించటం ఎంతో కష్టం. అందుకే ఆరోగ్య బీమా పాలసీల కింద ఈ జబ్బు కవర్ అవుతుందా...? అనే సందేహం ఎంతో మంది మదిలో మెదులుతోంది. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని సాధారణ బీమా కంపెనీలు స్పష్టత నిస్తున్నాయి.
కనీసం 24 గంటలు చికిత్స
కేవలం డే-కేర్ వైద్య సేవలు పొందినప్పుడు ఆరోగ్య బీమా పాలసీ వర్తించదని, ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటలు చికిత్స, ఇతర వైద్య సేవలు తీసుకుంటేనే పాలసీ క్లెయిమ్ చేయవచ్చని పేర్కొంటున్నాయి. కరోనా విషయంలో మరొక ఇబ్బంది కూడా కనిపిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇది ఇంకా విస్తరిస్తే... అప్పుడు దీన్ని మహమ్మారి (పాండమిక్) గా ప్రకటించే అవకాశం ఏర్పడుతుంది.
మహమ్మారిగా ప్రకటిస్తే
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కానీ, లేదా మనదేశంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘మహమ్మారి’గా ప్రకటిస్తే ఏ ఆరోగ్య బీమా పాలసీ కూడా వర్తించదు. అందువల్ల ఆరోగ్య బీమా పాలసీ ఉన్న వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ భయాలను కొంత వరకూ తొలగించేందుకు ఐఆర్‌డీఏ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధిÅకార సంస్థ) ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్ బాధితులు ఆరోగ్య బీమా క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిములను సత్వరం పరిష్కరించాలని, అంతేగాకుండా ఒకవేళ తిరస్కరించాల్సిన పరిస్థితులు ఉంటే ‘రివ్యూ కమిటీ’ కి తప్పనిసరిగా నివేదించాలని స్పష్టం చేసింది.
శాండ్ బాక్స్’ విధానం
ప్రత్యేకంగా కరోనా వైరస్ చికిత్స కోసమే ఆరోగ్య బీమా పాలసీలను ఆవిష్కరించేందుకు బీమా కంపెనీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఐఆర్‌డీఏ ఇటీవల ప్రవేశపెట్టిన ‘శాండ్ బాక్స్’ విధానం ఇందుకు వీలుకల్పిస్తోంది. ఈ విధానం ప్రకారం కొత్త పాలసీల రూపకల్పనలో బీమా కంపెనీలకు స్వేచ్ఛ లభిస్తోంది.
పాలసీని విడుదల చేసి ఆ తర్వాత అనుమతి
అత్యవసర పరిస్థితులు చోటుచేసుకున్నప్పుడు అందుకు అనుగుణంగా కొత్త పాలసీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటోంది. ఇటువంటి పాలసీలకు ఐఆర్‌డీఏ అనుమతి వచ్చే వరకూ వేచి చూడాల్సిన పనిలేదు. ముందుగా పాలసీని విడుదల చేసి ఆ తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకే కరోనా వైరస్ చికిత్సల కోసం ఉద్దేశించిన పాలసీలను సత్వరం ప్రవేశపెట్టేందుకు బీమా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
అగైనెస్ట్ కరోనా వైరస్’ పేరుతో
‘ఓన్లీ డిజిటల్’ బీమా సేవల్లో అడుగుపెట్టిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఈ విషయంలో ఇతర సంస్థల కంటే ముందంజలో ఉంది. దేశంలో తొలిసారిగా కొవిడ్-19 బాధితుల కోసం ప్రత్యేకంగా ‘కవర్ అగైనెస్ట్ కరోనా వైరస్’ పేరుతో పరిమిత కాలపు ఆరోగ్య బీమా పాలసీని తీసుకువచ్చింది. దీన్ని తీసుకున్న వారికి ‘ఫిక్స్‌డ్ బెనిఫిట్ కవర్’ లభిస్తుంది. అంటే కరోనా వైరస్ సోకితే బీమా కంపెనీ రూ.2 లక్షలు చెల్లిస్తుంది. క్వారంటైన్ కేసులు అయితే 50 శాతం పరిహారం వెంటనే లభిస్తుంది.
వారికి వర్తించదు
అయితే ఈ పాలసీ విషయంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 1వ తేదీ తర్వాత చైనా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా, హాంకాంగ్, మకావ్, తైవాన్, ఇటలీ, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో పర్యటించిన వారికి ఈ పాలసీ వర్తించదని బీమా కంపెనీ స్పష్టం చేస్తోంది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాటలోనే మరికొన్ని ఇతర సాధారణ బీమా కంపెనీలు కూడా కరోనా కవర్ లభించే ప్రత్యేక పాలసీలను ఆవిష్కరించే యత్నాల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పరిశీలనలో ‘కరోనా’ పాలసీ
కరోనా వైరస్ వ్యాధికి వర్తించే ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ‘‘అంతేగాక మున్ముందు అవసరాన్ని బట్టి ఇటువంటి వ్యాధులకు ప్రత్యేక పాలసీని ఆవిష్కరించే ఆలోచన చేస్తాం’’ అని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్- మార్కెట్ అండర్‌రైటింగ్ ఆపరేషన్ విభాగం అధిపతి పంకజ్ వర్మ తెలిపారు. ప్రస్తుత తమ ఆరోగ్య బీమా పాలసీ కింద కరోనా వైరస్ వ్యాధికి కవరేజీ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సరైన క్లెయిములు దాఖలైతే తాము తిరస్కరించడం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం