Harish Rao Review On PHCS: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యలో గణనీయంగా పురోగతి సాధించామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతం సిజేరియన్లు జరగడం బాధాకరమైన విషయమన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల పనితీరు, పురోగతిపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీ- సెక్షన్ల రేటు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టీ-డయాగ్నోస్టిక్, ఐహెచ్ఐపీ లాంటి వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్‌సీల వారీగా సమీక్ష చేపట్టారు.
క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా వైద్యాధికారులు నెలలో అన్ని పీహెచ్‌సీలను సందర్శించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నెలలో ఒక్కరోజైనా పీహెచ్సీలలో నిద్ర చేయాలన్న మంత్రి.. తానూ కూడా స్వయంగా ఒకరోజు నిద్ర చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు 23 నుంచి 21కి తగ్గిందని పేర్కొన్నారు. 2014తో పోలిస్తే ఎంఎంఆర్, ఎన్ఎంఆర్, ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యలో ప్రగతి సాధించామని హరీశ్ రావు వెల్లడించారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బంది పాల్గొన్నారు.