ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రుల హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లతో మంత్రి సమావేశమయ్యారు. కొవిడ్ తర్వాత వైద్య రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలిపారు. వైద్య శాఖలో దాదాపు 1400 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. వైద్య విధాన పరిషత్‌లో దాదాపు 700 మందికి పదోన్నతులు ఇవ్వటంతో ఆరోగ్యశాఖలో సంపూర్ణంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందిని చెప్పారు.
కొవిడ్ తగ్గుముఖం పట్టిందని.. జిల్లా ఆస్పత్రుల్లో ఇప్పటికే సాధారణ సేవలు ప్రారంభించామన్నారు. కొవిడ్ బాధితులకు గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని... నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు.