మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధి విధానాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. కరోనా సమయంలోనూ క్యాన్సర్, డయాలసిస్ లాంటి జబ్బులున్న రోగులకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందించామన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య కళాశాల వరకు అన్ని ఆస్పత్రులు ఒక వారధిలాగా పని చేయాలన్న ఈటల... చిన్న చిన్న జబ్బులకు రోగులు గాంధీ లాంటి దవాఖానాలకు రాకుండా... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర, క్లిష్ట సమస్యలకి మాత్రమే గాంధీ, ఉస్మానియా, ఎంజీఎంకు పంపించాలని సూపరింటెండెంట్లను మంత్రి కోరారు.