తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జాల పేరిట నాపై వస్తున్న ఆరోపణలన్నీ కట్టుకథలు: ఈటల - హైదరాబాద్​ తాజా వార్తలు

ఈటల రాజేందర్​
ఈటల రాజేందర్​

By

Published : Apr 30, 2021, 10:38 PM IST

Updated : May 1, 2021, 4:54 AM IST

22:28 April 30

కబ్జాల పేరిట నాపై వస్తున్న ఆరోపణలన్నీ కట్టుకథలు: ఈటల

కబ్జాల పేరిట తనపై వస్తున్న ఆరోపణలన్నీ కట్టుకథలని ఈటల రాజేందర్‌ కొట్టిపారేశారు. ఎన్ని సంస్థలతోనైనా విచారణ జరిపించి.. నిరూపణ చేస్తే సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. పథకం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటల... అందరి చరిత్రలూ తనకు తెలుసని... తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.

పక్కా ప్రణాళికతో.. ఉద్దేశ పూర్వకంగానే తనపై కొందరు విషప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తన క్యారెక్టర్‌ను దెబ్బ తీసేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనవని వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ జడ్జితోనే కాకుండా ఎన్ని సంస్థలతోనైనా విచారణ చేసుకోవచ్చని.. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. తన పేరిట ఎటువంటి అక్రమ షెడ్డులున్నా కూల్చుకోవచ్చని చెప్పారు.

ఎవరి భూమినీ కబ్జా చేయలేదు..

అచ్చంపేట, హకీంపేటలోని భూములు తొండలు గుడ్లు పెట్టని నిరుపయోగమైనవని ఈటల వివరించారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు సలహాలు తీసుకున్నానని తెలిపారు. రైతులే స్వచ్ఛందంగా తమ భూములు కొనుగోలు చేయాలని కోరితే... సీఎంవో సలహా ప్రకారం తీసుకున్నామని పేర్కొన్నారు. తాను ఎవరి భూమినీ కబ్జా చేయలేదని స్పష్టం చేశారు.

వారందరిపైనా విచారణ చేయాలి..

తనపై ఆస్తుల పేరిట చేస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల నిప్పులాంటి వ్యక్తని.. ఎక్కడా.. ఎవరి దగ్గరా 10 రూపాయలు తీసుకున్న పాపాన పోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్క సిట్టింగ్‌లోనే వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదించే వారు ఎందరో ఉన్నారని.. వారందరిపైనా విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

నేను ముదిరాజ్‌ బిడ్డనే..

కులం పేరిట తనపై విషం జల్లుతున్నారని ఈటల మండిపడ్డారు. తాను ముదిరాజ్‌ బిడ్డనేనని స్పష్టం చేశారు. ఆత్మాభిమానం కన్నా పదవి కూడా తనకు గొప్పదికాదని ఈటల రాజేందర్‌ చెప్పారు. 

ఇదీ చదవండి:ప్రశాంతంగా ముగిసిన మినీ పురపోరు.. 69 శాతం పోలింగ్​ నమోదు

Last Updated : May 1, 2021, 4:54 AM IST

ABOUT THE AUTHOR

...view details