హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్లో దొడ్డి కొమరయ్య 94వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటు కోసం సీఎంకు విజ్ఞప్తి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు.
సమాజంలో బలహీన వర్గాల వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకున్నామన్నారు. కులాలను బట్టి గౌరవించే దుర్మార్గ పరిస్థితి మన దేశంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేయాలని.. ఓట్ల కోసం పనులు చేయవద్దన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం సామాన్యుల ఐక్యత చాటిందన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టే పరిస్థితి వచ్చిందని.. ఓటుకి వెలగట్టడం దుర్మార్గమన్నారు. చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందని.. దొడ్డి కొమరయ్య ఇచ్చిన చైతన్యంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు.