ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఉన్నతస్థాయి ఆసుపత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ వైద్యసేవల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవడం వల్ల సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలెక్కువగా ఉంటాయనీ, కరోనా చికిత్సలతో పాటు సీజనల్, ఇతర వ్యాధులకు సంబంధించిన మందుల కొరత రానీయొద్దని కోరారు.
అన్ని ఆసుపత్రుల్లోనూ అవసరాలకు అనుగుణంగా మందులను, పరికరాలనూ కొనుగోలు చేయాలని, ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. టిమ్స్‌లో సేవలకు ఎంపికైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బుధవారం విధుల్లో చేరుతారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
అవసరమున్నవారి ఇంటికి వైద్యులు
పాజిటివ్ వచ్చినవారిలో స్వల్ప లక్షణాలుంటే ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో చికిత్స అందించాలని, వీరికి ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యసేవలు అవసరమున్నవారి ఇంటికి వైద్యులను పంపించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు తప్పనిసరిగా రోజుకు కనీసం మూడుసార్లు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, రోగులకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
అన్ని జిల్లాల్లోనూ వైద్యకళాశాలల్లో రోగులను చేర్చుకోవడానికి వీలుగా పడకలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఇంటింటికి తిరిగి అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు నిండిపోవడంపైనా సమావేశంలో చర్చించారు.