ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా సంస్కరణలు తీసుకురాబోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక అంశాలను చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం....ఆరోగ్యశ్రీ తదితర అంశాలపై పలు మార్పులు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. వైద్యం ఖరీదును తగ్గించడమే గాక.... అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సల వంటి ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని మంత్రి ఈటల అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. కేరళ, ఇతర రాష్ట్రాలను పోటీపడుతు వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
త్వరలోనే ఖాళీలు భర్తీ..
ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన మందులు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్య సిబ్బంది పరంగా ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే 12,000 ఉద్యోగాలు మంజూరైనప్పటికీ కరోనా వల్ల పెండింగ్‌లో ఉండిపోయాయని... భవిష్యత్‌లోనే వాటిని భర్తీ చేస్తామని ఈటల తెలిపారు.