కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని వెల్లడించారు. కొవిడ్ కట్టడికి ఖర్చులో వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు పెంచేందుకు టెస్టింగ్ మిషన్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
పరీక్షల సంఖ్య పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాం: ఈటల - తెలంగాణలో కరోనా తాజా వార్తలు
కరోనా నియంత్రణకు, చికిత్సకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చప్పట్లు కొట్టండి... దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కరోనా పేరుతో భాజపా నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్ మిషన్లను వేరే రాష్ట్రాలకు తరలిస్తోందని ఈటల అన్నారు. ప్రజల పట్ల తమకున్న చిత్తశుద్ధి ఇంకెవరికీ ఉండదని... తమను ఎవరూ ప్రశ్నించలేరన్న ఆయన ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని స్పష్టం చేశారు.
వారంలోగా టిమ్స్ ప్రారంభం...
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేవలం 214 కోట్ల నిధులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కరోనా పరీక్షలు తక్కువ చేస్తున్నామంటూ భాజపా నేతలు... వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవాలన్నారు. రోజుకు 4 వేల పరీక్షలు చేయగల సామర్థ్యమున్న టెస్టింగ్ మిషన్లను ఆర్డర్ చేశామని... రోస్ సంస్థకు చెందిన కోబొస్ 8,800 మిషన్లను ఆర్డర్ చేశామని వెల్లడించారు. వారం రోజుల్లో గచ్చిబౌలి టిమ్స్‌ను ప్రారంభించాలని మంత్రి ఈటల ఆదేశించారు. టిమ్స్‌కు డాక్టర్ విమల థామస్‌ను ఇంఛార్జిగా నియమించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 2,290 కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యముందని... వారంలో 4,310లకు పెంచి 6,600 పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.