ALLA NANI ON CORONA NEW VARIANT: కరోనా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant news) కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ సన్నద్ధతపై ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుందని చెప్పారు.
"ఒమిక్రాన్ కట్టడిపై మధ్యాహ్నం సీఎం సమీక్షిస్తారు. ఏ వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం. కేంద్ర మార్గదర్శకాల మేరకు నడుచుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి 2,440 వైద్య చికిత్సలు."
-ఆళ్ల నాని, ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాల శిలాఫలకానికి హోంమంత్రి సుచరిత, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎందరో పేరున్న వైద్యులు విద్యనభ్యసించారని.. ఇలాంటి పురాతన కళాశాల ఉత్సవాలు జరుపుకోవటం గొప్ప విషయమని ఆళ్ల నాని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని.. కొత్త వ్యాధులను సైతం పథకంలో చేర్చామని వెల్లడించారు.
వణికిస్తున్న కొత్త వేరియంట్..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(South african variant)..ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వైరస్.. వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఇది డెల్టా వేరియంట్ కంటే వ్యాప్తి చెందగలదన్న ఆందోళనల మధ్య ఈ వైరస్ కట్టడికి వివిధ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వేరియంట్ గురించి తొలిసారి అప్రమత్తం చేసిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జే..ఈ వేరియంట్ సోకిన బాధితుల్లో ఉండే లక్షణాల(Omicron variant syptoms) గురించి కీలక విషయాలు వెల్లడించారు.
కరోనా సోకిన వారికి రుచి, వాసన కోల్పోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి సాధారణ లక్షణాలు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో.. రుచి, వాసన కోల్పోవడం లేదని ఏంజెలిక్ తెలిపారు. తీవ్రమైన అలసట, నాడీ వేగం అధికంగా ఉండటం వంటి అసాధారణ లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. ఈ లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయని వెల్లడించారు.
వైద్య రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఏంజెలిక్.. ఈ నెల ప్రారంభంలో తన కుటుంబంలోని నలగురు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుండగా... వారిలో లక్షణాలు విభిన్నంగా ఉండడం గమనించారు. అనంతరం నవంబరు 18న దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీకి విషయాన్ని తెలియజేశారు. అనంతరం కొత్త వేరియంట్ బయటపడినట్లు తేలింది.