తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Corona cases Alert : తస్మాత్ జాగ్రత్త.. నిర్లక్ష్యానికి తప్పదు.. భారీ మూల్యం! - తెలంగాణ వార్తలు

Hyderabad Corona cases : హైదరాబాద్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే లక్షణాలు మాత్రం అంత తీవ్రంగా లేవు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Hyderabad Corona cases Alert, covid cases in hyd
హైదరాబాద్​లో కరోనా కేసులు

By

Published : Jan 4, 2022, 9:00 AM IST

Hyderabad Corona cases : మిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో నగరంలో క్రమంగా కేసులు పెరుగుతున్నా.. చాలామందిలో ప్రస్తుతానికి తీవ్ర లక్షణాలు లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రత తక్కువగా ఉన్నా కొన్నిసార్లు వైరస్‌ లోలోన తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. కొవిడ్‌ అనంతర సమస్యలు వెంటాడే అవకాశం ఉందంటున్నారు. వైరస్‌ ఎవరిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయడం కష్టమని హెచ్చరిస్తున్నారు.

* కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల వరకు 20 మంది బాధితులు ఉన్నారు. సోమవారానికి ఆ సంఖ్య 25కు చేరింది. వారంతా తీవ్ర లక్షణాలున్నవారే. పలువురు చేరేందుకు వస్తున్నా...ఆక్సిజన్‌ స్థాయిలు సక్రమంగా ఉంటే మందులిచ్చి ఇళ్లకు పంపుతున్నారు.

* గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. మిగతా వారంతా సాధారణ వార్డులో వైద్య సేవలు పొందుతున్నారు.

* సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చెందిన మూడు శాఖల్లో 25 కొవిడ్‌ కేసులు ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని మరో కార్పొరేట్‌ ఆసుపత్రిలో 20 మంది బాధితులున్నారు.

రెండింతలు పెరుగుదల...


గత నాలుగైదు రోజులుగా కేసుల పెరుగుదలలో ఒక్కసారిగా మార్పు కన్పిస్తోంది. గ్రేటర్‌లో డిసెంబరు 30న 167గా ఉన్న బాధితుల సంఖ్య సోమవారానికి 294కు చేరింది. మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో టిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో చాలామందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడంలేదని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ తగ్గితేనే గాంధీ ఆసుపత్రిలోకి... మందులు వాడుతూ ఇంట్లో ఉండే బాధితులు ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే గాంధీ ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 200 పడకలు కేటాయించారు. 150 వెంటిలేటర్లను, 50 ఆక్సిజన్‌ పడకలను అందుబాటులో ఉంచారు. వెంటిలేటర్ల రోగుల కోసం 3 వార్డులు, ఆక్సిజన్‌ అవసరమయ్యే వారికి ఒక వార్డు, వృద్ధులు, అనుబంధ రోగాలు ఉన్న బాధితులకు ఒక వార్డు, ఒమిక్రాన్‌ అనుమానితుల కోసం రెండు వార్డులను ప్రత్యేకించారు.

అప్రమత్తతతోనే బయటపడగలం


తక్కువ లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. వైరస్‌ అనేది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కరోనా అనుబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెండో దశలో ఒక్క గాంధీలోనే 1,500 మంది బ్లాక్‌ఫంగస్‌తో చేరారు. వీరిలో 1,100 మందికి శస్త్ర చికిత్సలు చేశాం. చాలామందికి దవడలు తీసేశాం. ఫంగస్‌తో కొందరు కళ్లు పోగొట్టుకున్నారు. వైరస్‌ ఒక్కొక్కరిలో ఒక్కోలా మారుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఏ మాత్రం అనుబంధ రోగాలు లేని వారు సైతం ఎంతోమంది చనిపోయారు. ఇందులో యువత ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ మాత్రమే కాదు...డెల్టాకేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే భారీ మూల్యం తప్పదు.

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

ఇదీ చదవండి:IRDAI about omicron Treatment: ఒమిక్రాన్‌ చికిత్సకూ ఆరోగ్య బీమా: ఐఆర్‌డీఏఐ

ABOUT THE AUTHOR

...view details