తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ - Case of coronavirus in telangana

కరోనాతో చనిపోతున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న మరో 3 జిల్లాల వారేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రిని కోరారు.

health deportment gave report to cm on corona in hyderabad
ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ

By

Published : May 5, 2020, 11:04 AM IST

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్​ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణి, సీనియర్ వైద్యశాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు సాగిన సమీక్షలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు.

29 మంది మృతి

వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1085 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని.. వారిలో 585 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి కాగా.. 29 మంది మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం 471 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలో పేర్కొన్న అధికారులు.. వైరస్ వ్యాప్తి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ ఉందని వెల్లడించారు. మొత్తం 1085 పాజిటివ్ కేసుల్లో 717 మంది నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారని చెప్పారు. మరణించిన వారిలో కూడా 82.21 శాతం మంది ఈ జిల్లాల వారు ఉన్నారని తెలిపారు.

ఏమాత్రం పట్టు వదిలినా..!

అంతే కాకుండా గడిచిన 10 రోజుల్లో నమోదైన కేసుల్లో కూడా అత్యధిక శాతం మంది ఈ జిల్లాలకు చెందిన వారే ఉన్నారని... ఈ జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు. జనసాంద్రత ఎక్కువున్న ప్రాంతం కావడం వల్ల ఏమాత్రం పట్టు వదిలినా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నివేదికలో వివరించారు. ఈ నాలుగు జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వొద్దని లాక్‌డౌన్‌ను యథావిధిగా, అవసరమైతే మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించినట్లు సమాచారం.

కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ

మిగతా జిల్లాల్లో పరిస్థితి చాలా మెగురుపడిందని నివేదికలో పేర్కొన్న అధికారులు... కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందన్నారు. ఆ జిల్లాల్లో రెడ్ జోన్లు ఆరెంజ్​ జోన్లుగా, ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయని అధికారులు నివేదికలో వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా? వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? అనే తదితర అంశాలను కేబినెట్‌లోనే చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details