"అరె మన హెడ్ మాస్టారుకు ఏదో అయిందిరా.. కనీసం కూర్చోలేక పోతున్నారు.. గోడను పట్టుకుని పాకుతున్నారు... ఏమైంది సార్ అని అడిగితే కయ్ కయ్ మంటున్నాడు.. పైగా ఏదో వాసన కూడా వస్తుందిరా.. ఏమైందో పాపం..."
"ఎహే ఊరుకో... ఆయన ఫుల్గా తాగొచ్చాడురా.. నీకు తెలియడం లేదా ఏంటి..?"
"అవునా..! నేనింకా ఏదో జరిగింది పాపం అనుకున్నాను సుమా.. అయినా మాస్టారు తాగి రావడం ఏంటిరా.. ? మరేం చేస్తాం.. అలా ఉంది మన స్కూలు పరిస్థితి.." పాఠశాల నుంచి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతున్న ఇద్దరు విద్యార్థుల సంభాషణ ఇది..
drunk Headmaster : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు... ఫుల్గా మద్యం తాగి తూలుతూ ఊగుతూ పాఠశాలకు వచ్చాడు. నాలుక మడతపడేంత మత్తుగా తాగొచ్చి నిలబడలేక గోడ పట్టుకుని పాకుతూ.. నేలపై దేకుతూ కూలబడిపోయాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పర వలస ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది.
ఈ పాఠశాలలో మొత్తం 52 మంది విద్యార్థులు ఉన్నారు. ఓ ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లారు. ఇక మిగిలింది ప్రధానోపాధ్యాయుడు తిరుపతి మాత్రమే. ఆతనైనా పాఠాలు చెబుతాడు అనుకుంటే ఫుల్గా తాగొచ్చి నానా హంగామా చేశాడు. మాస్టారును ఈ స్థితిలో చూసిన పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటికొచ్చేసిన పిల్లలను చూసి.. ఏమైందని తల్లిదండ్రులు అడిగితే అసలు విషయం చెప్పారు.
పిల్లల ద్వారా మాస్టారు నిర్వాకం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి మాస్టారును నిలదీశారు. కనీసం ఆయన వారి మాటలకు సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే ఇలా ఉంటే ఇక తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
'మాస్టారు తాగొచ్చి పడిపోతుంటే పిల్లలు పట్టుకుంటూ ఉండాలి.. అందుకేనా ఆయన చదువులు చెబుతున్నారు. మీటింగులు పెట్టినప్పుడు ఎన్ని గొప్పలు చెప్పారు. మిమ్మల్ని ఇలా చూస్తున్నప్పుడు మా పిల్లలు ఎందుకు చెడిపోరు.? చదువులు లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి..?' - విద్యార్థుల తల్లిదండ్రులు.
'స్కూలు హెడ్ మాస్టారు తాగొచ్చి పడిపోతున్నాడు. ఈ పాఠశాలలో మా అబ్బాయి రెండో తరగతి చదువుతున్నాడు. అయితే మా పిల్లాడి టీసీ తీసుకెళ్లిపోవాలని అనుకుంటున్నాం. ఈ పాఠశాలలో ఈ ఉపాధ్యాయుడిని మార్చి కొత్త టీచర్ను వేయాలి.' - ఓ విద్యార్థి తల్లి
drunk Headmaster : తాగి తూలుతూ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు.. ఆపై.. ఇదీ చూడండి:Tiger near pakala Forest: రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం.. హడలెత్తిన వాహనదారులు