తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 12:15 AM IST

ETV Bharat / state

అభ్యంతరకర పోస్టింగులు తొలగించండి: ఏపీ హైకోర్టు

న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వివిధ సామాజిక మాధ్యమ కంపెనీలకు ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ పోస్టింగుల వివరాలను కంపెనీలకు ఇవ్వాలని ఏపీ సీఐడీకి స్పష్టం చేసింది.

అభ్యంతరకర పోస్టింగులు తొలగించండి: ఏపీ హైకోర్టు
అభ్యంతరకర పోస్టింగులు తొలగించండి: ఏపీ హైకోర్టు

అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు పరిపాలనాపరంగా వేసిన అనుబంధ పిటిషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు వేసేందుకు ధర్మాసనం గడువిచ్చింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె. ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ హైకోర్టు అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణలో హైకోర్టు ఆర్‌జీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన అఫిడవిట్​లో సవరణ చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. ఏజీ ఎస్‌. శ్రీరామ్‌ కౌంటరు దాఖలు చేయడానికి స్వల్ప గడువు కోరారు.

తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ తెదేపా నేత, మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్​లో న్యాయవాది మురళీధర్‌రావు వాదనలు వినిపించారు. హైకోర్టుపై సామాజిక మాధ్యమంలో అభ్యంతర పోస్టింగుల వెనుక కుట్రకోణం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివరాలను దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచించింది. న్యాయవాది బదులిస్తూ.. ప్రభుత్వ కింద దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. హైకోర్టు 94 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తే కొంతమందిపైనే 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. ఏపీ ప్రభుత్వమే న్యాయవ్యవస్థపై పోస్టింగుల వెనుక ఉండి మొత్తం చేస్తోందన్నారు. ఆ వాదనలపై ఏజీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

వ్యవస్థలు కుప్పకూలుతాయి: ధర్మాసనం

సామాజిక మాధ్యమ కంపెనీల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, ముకుల్‌ రోహత్గీ, కపిల్‌ సిబల్‌, మరికొందరు విచారణలో పాల్గొన్నారు. అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలు, సంస్థలను కోరాలని ధర్మాసనం తెలిపింది. వీటికి అనుమతిస్తే ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు కుప్పకూలుతాయని తెలిపింది. తగిన సూచన చేస్తామని సీనియర్‌ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

సీఐడీపై అసంతృప్తి

సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఓ తీర్పు ప్రకారం అభ్యంతర పోస్టింగులను తొలగించాల్సి ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీరెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పేపర్లపై పని చేసినట్లు కనిపించడం కాదని.. చర్యలు వాస్తవ రూపంలో ఉండాలని వ్యాఖ్యానించింది. నిజంగా న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే ఆ పోస్టింగుల తొలగింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలంది.

ఇదీ చదవండి:నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details