శాశ్వత ఉద్యోగుల్లాగే రోజుకు 8 గంటలకు పైగా విధులు నిర్వహిస్తున్న బాల్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించకపోవడం వివక్ష చూపడమేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. బాల్వాడీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉద్యోగుల్లా కనీస వేతనాలు చెల్లించాలని..విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించింది. అయితే వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాల్సిందిగా ఆదేశించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. నిరుద్యోగ యువత పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం..వివిధ మార్గాల్లో వారిని ఎంపిక చేసి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండటాన్ని తప్పుబట్టింది.
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా నియమితులైన వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ..గతేడాది డిసెంబర్‌లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మురికివాడల్లో వయోజన విద్యను ప్రోత్సహించడం, మూడు నుంచి ఐదేళ్ల పిల్లలకు చదువు చెప్పడం, బడి మానేయకుండా చూడటం బాల్వాడీ టీచర్ల విధి. అలాగే ఏపీ ప్రభుత్వం అప్పగించిన ఇతర పనులు చేసినా అదనపు పారితోషకం కూడా చెల్లించేవారు కాదని.. శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశతోనే ఇప్పటికీ పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. క్రమబద్ధీకరణ, కనీస వేతనంపై తమ వినతిని తోసిపుచ్చిన అధికారులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2017 జూన్ 19న ప్రొసీడింగ్స్ జారీ చేశారని వాపోయారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు...పిటిషనర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బాల్వాడీ టీచర్లుగా తీసుకున్నట్లు చెప్పారు. వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని...2016లో పారితోషకాన్ని 6 వేల 700 కు పెంచామని వివరించారు.