BRS 23rd Foundation Day Today : తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన గులాబీ పార్టీ.. నూతన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగురవేశారు. గులాబీ పార్టీ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. కేసీఆర్‌తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు మొదలు.. క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది.
2014లో మొదటిసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్: 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణ భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తూ వచ్చింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, తెలుగుదేశం సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.