Hattrick Leaders in Telangana : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు కదనరంగంలోకి దూకారు. ప్రత్యర్థుల వ్యూహాలకు.. చెక్‌పెడుతూ ప్రచారంలో(Campaign) దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ఇంటిటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు. బరిలో నిలిపిన గుర్రాలను గెలుపు బాట పట్టించడానికి పార్టీలు పరుగులెత్తుతుండటంతో ప్రచారం ఉరకలెత్తుతోంది.
Some Leaders Trying to Hattrick in Elections :ఓవైపు కొందరు నాయకులు ఇప్పటికే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించగా (Hattrick Leaders).. మరోవైపు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మరికొందరు నేతలు.. ఈ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనే ధీమాతో ఉన్నారు. కానీ ఓటర్లను మెప్పించి వరసగా మూడుసార్లు గెలవడం అభ్యర్థులకు పెద్ద సవాలే అని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో కొందరే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి టి.ప్రకాశ్ గౌడ్, ఆసిఫ్‌నగర్ నుంచి దానం నాగేందర్ ఇదివరకే హ్యాట్రిక్ కొట్టారు. వీరు ఈసారీ ఎన్నికల్లో బరిలో ఉండగా.. మరికొంత మంది హ్యాట్రిక్ రేసులో ఉన్నారు.
- సనత్‌నగర్‌నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇప్పడు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
- కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోటీచేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి గెలుపొందారు. అనంతరం 2018లో బీఆర్ఎస్‌లో నుంచి విజయం సాధించారు.
- కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. తాజాగా అదేపార్టీ తరఫున బరిలో నిలిచారు.
- శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2018లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు
- జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి.. మరోసారి బరిలో నిలిచారు.
- చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్ నుంచి, 2018లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు.