పచ్చదనం శాతాన్ని పెంచడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారం కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ, అటవీయేతర భూముల్లో 230 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. కార్యక్రమంలో భాగంగా అటవీయేతర ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, సామాజిక వనాల అభివృద్ధి, రహదారుల వెంట, గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. ఇప్పటి వరకు అటవీయేతర భూముల్లో 153 కోట్లు, అటవీ ప్రాంతాల్లో 57 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 210 కోట్ల 68 లక్షల మొక్కలు నాటారు. వచ్చే రెండేళ్లలో మరో 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2021లో 20 కోట్ల వరకు.. 2022లో 19 కోట్లకు పైగా మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏటా 30 కోట్ల మొక్కలు..
హరితహారం కోసం గ్రామాలు, పట్టణాల్లో 13 వేలకుపైగా నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏటా 30 కోట్ల మొక్కలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వనాలనూ అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రి నమూనాలో ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16వేలకు పైగా ప్రకృతివనాలు పూర్తయ్యాయి.