తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం - హరితహారం తాజా వార్తలు

రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ఈ మహాక్రతువులో.. ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ మొక్కలు నాటిన మంత్రులు...హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.

HARITHA HARAM PROGRAM IN TELANGANA OVER ALL
రాష్ట్రవ్యాప్తంగా హరితహారం సందడి.. మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

By

Published : Jun 25, 2020, 6:08 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎక్కడ ఎవరు పాల్గొన్నారంటే..?

ఓరుగల్లులో జోరుజోరుగా....

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం క్రాస్ వద్ద... ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి.. మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. అనంతరం మరియాపురం నుంచి చేలపర్తి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని కార్యకర్తలకు సూచించారు.

ములుగు జిల్లా భూపాల్ ప్లాంటేషన్‌లో ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ మొక్కలు నాటారు. పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి మొక్కలు నాటారు. కాజిపేట్ మండలం రాంపూర్ ఆక్సిజన్ పార్కులో స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య హరితహారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ సమీపంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ .. రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

ఖమ్మంలో పువ్వాడ ...

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో మంత్రి నిరంజన్ రెడ్డి... ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మొక్కలు నాటారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్ పార్కులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. అనంతరం వెలుగుమట్ల అర్బన్ పార్కులో... 117 ఎకరాల్లో 57 వేల 700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందూరులో మంత్రి ప్రశాంత్​

నిజామాబాద్ జిల్లా వేల్పుర్ మండలం పచ్చలనడుకుడలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి... మొక్కలు నాటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అటవీ సంపద అవసరమన్న మంత్రి... ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పాలమూరులో మంత్రి శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్‌నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామాలు, మున్సిపాలిటీ నిధుల్లో 10శాతం గ్రీనరీకే కేటాయిస్తున్నామని వివరించారు.

వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతం... గోదంగూడ గ్రామంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను బతికించుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సంగారెడ్డి పురపాలక పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు.

కరీంనగర్​లో...

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ శశాంక ఆరో విడత హరితహారంలో పాల్గొన్నారు. 313 గ్రామ పంచాయతీల్లో 55 లక్షల మొక్కల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. జగిత్యాల ఏడో వార్డులో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన హరితహారంలో పీఓ గౌతమ్‌ పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూర్, కృష్ణ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మొక్కలు నాటారు.

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరో విడత హరితహారం ప్రారంభించారు. మంచిర్యాలలోనే ఈ ఏడాది 5 లక్షల 65 వేల మొక్కలను నాటుతామని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనకపూర్ ప్రాంతంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా, సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మొక్కలు నాటారు.

యాదాద్రీశుడి కొండను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని మొక్కలు నాటుతున్నారు. దక్షిణ దిశలో పచ్చదనం పరచుకునేలా చర్యలు చేపట్టామని యాడా అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details