Sangareddy Congress leaders Joined in BRS Party : మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇవాళ జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘ నేతలు, బీఆర్ఎస్లోకి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందించామని పేర్కొన్నారు. పాత, కొత్త వారు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగరేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా.. బీఆర్ఎస్ పాలనలో కరెంటు బాగుందా అని తెలంగాణ సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు.
"కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్కు అంత లాభం. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. పాత, కొత్త నేతలు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగురవేయాలి". - హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి