harishrao comments on bandi sanjay: కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్ బీమా యోజనాతో రైతులకు వచ్చే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదని తెలంంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలోని పది రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారన్న ఆయన.. దీనిని బట్టే ఆ పథకం నామమాత్రంగా ఉందని అర్థం కావడం లేదా అని అన్నారు.
పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు పదివేలు చొప్పున 228 కోట్ల రూపాయాల సాయం ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని హరీశ్ రావు తెలిపారు. బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరమని... దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు అదానీ ఆదాయాన్ని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ.. నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర బీజేపీది అని ఆక్షేపించారు.
వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.