Rythubandhu completed five years in Telangana : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి నేటితో ఐదేళ్లు అయ్యాయని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతు బంధు వ్యవసాయాన్ని.. పండగ చేసి రైతన్నను రాజును చేసిందని ట్విటర్ వేదికగా హరీశ్‌రావు తెలిపారు. ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారని పేర్కొన్నారు. అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తున్నాయని వెల్లడించారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు.
రైతు బంధు ఎప్పుడు ప్రారంభించారు: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు, రైతుల ఆదాయం సమకూర్చేందుకు, అప్పుల ఊబిలో అన్నదాతలు కూరిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 2018- 19 ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం(రైతు బంధు) అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ప్రతి సీజన్‌లో రైతుకు ఎకరానికి రూ.5 వేలు వారి ఖాతాలో వేస్తుంది. ఇప్పటి వరకు 10 విడతలుగా రాష్ట్రంలో ఉండే రైతులకు రూ.65 వేల కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.